అసెంబ్లీ
ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలక
బీఆర్ఎస్కు దీటుగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే
ప్రజాక్షేత్రంలో ఆయా పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ప్రచారపర్వంలో
ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకు పడుతున్నారు.
హ్యాట్రిక్ కోసం కేసీఆర్
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోంది. తెలంగాణలో
అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ దూకుడు
ప్రదర్శిస్తోంది.
పాలక
బీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఏఐఎమ్ఐఎమ్),
కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిని
రేకిస్తున్నాయి. ‘‘ఆర్భాటపు ప్రకటనలు, కల్లబొల్లి మాటలు చెప్పడం మాని కాంగ్రెస్
నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని’’ సవాల్ విసిరారు. వయనాడ్ నుంచి కాకుండా రాహుల్ తనపై పోటీ చేయాలని ఎమ్ఐఎమ్
అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఎమ్ఐఎమ్
పార్టీ సమావేశంలో ప్రసంగించిన అసదుద్దీన్, అయోద్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కాంగ్రెస్
పాలనలో జరిగిందన్నారు.
కాంగ్రెస్
నేతలు పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నారని మండిపడిన ఎమ్ఐఎమ్ చీఫ్, అనవసరపు విమర్శలు
మాని హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బాబ్రీ మసీదుతో
పాటు సెక్రటేరియట్ మసీదు కూల్చివేత కాంగ్రెస్ పాలనలో జరిగిన విషయాన్ని
మరిచిపోలేదన్నారు.
ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
గాంధీ, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. వేరే
వేరు పార్టీలుగా ఉన్నప్పటికీ కలిసే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మూడు
పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్, ఓవైసీని ప్రధాని
మోదీ తన సొంతవారిగా భావిస్తున్నారని అందుకే వారిపై ఈడీ కేసులు దాఖలు కాలేదని ఘాటు
విమర్శలు చేశారు.