స్కిల్
స్కామ్ కేసులో తనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు
సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రేపు విచారణ తేదీని ఖరారు చేస్తామని సీజేఐ చెప్పారు.
త్వరగా
వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చేసిన అభ్యర్థిపై చీఫ్
జస్టిస్ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబును ఎప్పుడు అరెస్టు చేశారని అడగగా, ఈ
నెల 8న అని లూథ్రా బదులిచ్చారు. పిటిషన్ను రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని
తెలిపారు. అన్ని వివరాలు పిటిషన్లో పొందుపరచాలని సీజేఐ సూచించారు.
ఈనెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు
వరుస సెలవులు ఉన్నాయి. 28న మిలాదున్ నబీ కాగా
29న దిల్లీలో స్థానికంగా సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 30 శనివారం, అక్టోబర్1
ఆదివారం, అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవులు కావడంతో చంద్రబాబు పిటిషన్ విచారణ
ఎప్పుడు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు.
ఏసీబీ
కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత విచారణకు రానుంది. అలాగే
పీటీ వారెంట్లపై న్యాయమూర్తి విచారించనున్నారు. బెయిల్ పై ఇరుపక్షాల వాదనలు
వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.
పలువురు టీడీపీ నేతలు వేర్వేరు కేసుల్లో
హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల కేసులో ముందస్తు
బెయిల్ కోసం పిటిషన్ వేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ, తనపై నమోదైన కేసు
కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి రింగురోడ్డు కేసులోనూ
వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది.
వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ను
క్వాష్ చేయాలని కొల్లు రవీంద్ర పిటిషన్ వేయగా, పేర్ని నాని ఫిర్యాదు చేసిన కేసులో
ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని బుద్ధా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు.