భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఉమ్మడి పరిష్కార వేదికపై చర్చకు సిద్దమని ఆ దేశ రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ పిలుపునిచ్చారు. ‘‘ మేము చర్చలకు సిద్దంగా ఉన్నాం. ఒక సారి చర్చలంటూ మొదలైతే, తమ పౌరులకు నిజంగా సహాయం చేయాలని భావిస్తూ ఉంటే ఒక ఉమ్మడి పరిష్కార వేదిక కనుగొనడం కష్టం కాదంటూ’’ కెనడా రక్షణ మంత్రి బ్లెయిర్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మా గడ్డపై మా పౌరుడిని హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని కెనడా రక్షణ మంత్రి బ్లెయిర్ వ్యాఖ్యానించారు.దౌత్యపరమైన ఉద్రిక్తతలు భారత్ కెనడాల మధ్య ప్రభావం చూపుతాయని తెలుసంటూ బ్లెయిర్ వ్యాఖ్యానించారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి.
నిజ్జర్‌ను భారత్ గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని ఓ గురుద్వారా వద్ద కొందరు దుండగులు నిజ్జర్‌ను కాల్పి చంపిన సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక దోషులను తేల్చేందుకు భారత్‌తో కలసి నిర్మాణాత్మకంగా పని చేయడానికి తాము సిద్దంగా ఉన్నట్టు శుక్రవారంనాడు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు.
నిజ్జర్ హత్యపై విచారణ కొనసాగుతోందని, అసలేం జరిగిందనే దానిపై నిజాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని బ్లెయిర్ అన్నారు. కెనడా, భారత్ నిజ్జర్ హత్య వెనుక నిజాలు తెలుసుకుని, దౌత్యపరమైన ఉద్రిక్తతలు తొలగించేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని బ్లెయిర్ అభిప్రాయపడ్డారు. ఇది చాలా ముఖ్యమైంది. విచారణలో ఎలాంటి రాజీ పడే పనిలేదని, విచారణకు సహకరించాలని తమ మిత్రపక్షాలు కూడా కోరుతున్నట్టు బ్లెయిర్ గుర్తుచేశారు.