జీ 20 దేశాల సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన తరవాత ప్రపంచంలో భారత ప్రతిష్ఠ మరింత పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. జీ 20 సందర్భంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను సభ్యదేశాలకు సూచించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ కారిడార్ అనేక దశాబ్దాలపాటు ఆధారంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 విజయవంతం, జీ 20 సమావేశాలు దేశంలో ప్రతి పౌరుడి ఆనందాన్ని రెట్టింపు చేశాయని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ప్రజల నుంచి తనకు అందిన సందేశాల్లో ప్రధానంగా ఈ అంశాలే ఉన్నాయన్నారు.
జీ 20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్వత్వం ఇవ్వడం ద్వారా భారత నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని మోదీ గుర్తుచేశారు. జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ మండపం ప్రముఖ ప్రాంతంగా మారిందని ఆయన అన్నారు. దాని ముందు వేలాది మంది ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారని మోదీ వెల్లడించారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయాలను గుర్తుచేశారు.
అతి తక్కువ పెట్టుబడితో లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటక శాఖ ముందుందని ఆయన అన్నారు. జీ 20 దేశాల ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారన్నారు. మన సంస్కృతి వారసత్వ సంపదలు, వైవిద్యం గురించి ప్రతినిధులు తెలుసుకున్నట్టు మోదీ తెలిపారు. బెంగాల్‌లోని శాంతినికేతన్, కర్ణాటకలోని హోయసల ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కడం గర్వించాల్సిన విషయమన్నారు. ఈ రెండింటితో దేశంలో 42 కట్టడాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నట్టైంది.