రాష్ట్ర
ఆర్థిక పరిస్థితిపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు
ప్రజల్ని మభ్యపెట్టేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి
అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని దుయ్యబట్టిన
పురందరేశ్వరి.. నాణ్యత లేని మద్యం
విక్రయాల ద్వారా ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమడుతోందని ఆగ్రహం వ్యక్తం
చేశారు.
గతంలో
రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా మార్చేశారని, కొత్త బ్రాండ్లను
మార్కెట్లోకి తెచ్చి వాటి ద్వారా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో
ఉన్న యాజమాన్యాల నుంచి కంపెనీలు లాక్కుని పేర్లు మార్చి వైసీపీ నేతలు
నడుపుతున్నారని చెప్పారు.
విశాఖపట్నంలో బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరాని, ఎంపీ జీవీఎల్ తో
కలిసి పాల్గొన్న పురందరేశ్వరి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ వాస్తవాలు
చెబితే దానిని ఖండించేందుకు వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు.
రాష్ట్రంలో
అభివృద్ధి జరగడం లేదని, పెట్టుబడులు రాకపోవడంతో యువతకు ఉపాధి దొరికే పరిస్థితి
లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం
అందజేయడంతో పాటు ప్రజలను ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకు మాత్రమే ఉందన్నారు.
మోదీ సర్కార్, మహిళలకు సంపూర్ణ సాధికారత కల్పించిదన్న
పురందరేశ్వరి, ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.