తిరుమల కొండపై దొంగలు చెలరేగిపోతున్నారు. తిరుమలలో భక్తుల బ్యాగులు కొట్టేశారనో, ఫోన్లు కాజేశారనో చాలా వింటూ ఉంటాం. ఈ సారి ఏకంగా ఓ ఘరానా దొంగ టీటీడీ వారు భక్తుల ఉచిత ప్రయాణానికి ఉపయోగించే ధర్మరథం ఏసీ ఎలక్ట్రిక్ బస్సునే కాజేశాడు.ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో దొంగతనం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఏసీ బస్సు విలువ రూ.2 కోట్లపైమాటే.
ఇవాళ తెల్లవారుజామున జీఎన్సీ టోల్గేటు నుంచి తిరుపతికి వస్తున్న ఏసీ బస్సును భద్రతా సిబ్బంది కనీసం తనిఖీ కూడా చేయకుండా వదిలేశారు. ఉదయాన్నే ఏసీ బస్సు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏసీ బస్సును తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఉన్నట్లు జీపీఎస్ ద్వారా గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.