తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా
కొనసాగుతున్నాయి. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీమలయప్పస్వామి
భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకున్న భక్తులు గోవిందనామాన్ని భక్తశ్రద్ధలతో
జపించారు.
ఉత్సవాల సందర్భంగా కళాబృందాల ప్రదర్శనలు అలరిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు
శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజన సేవ నిర్వహించనున్నారు. రాత్రికి తిరుమలేశుడికి
చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.
శనివారం
రాత్రి గజవాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును
దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయాయని నమ్మకం, మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం
కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు
గజవాహనంపై ఊరేగుతారని పండితులు వివరిస్తున్నారు.
ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగింపు
నిర్వహిస్తారు.
తిరుమలలో
భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో
కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపల క్యూలైన్ లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24
గంటలు ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.