నిషిద్ధ వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్
అధినేత, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ జాతీయ దర్యాప్తు సంస్థ సీజ్ చేసింది.
పంజాబ్ చండీగఢ్‌లోని అతని నివాసాన్ని సీజ్ చేయడంతో పాటు అమృతసర్‌లోని భూమిని కూడా
స్వాధీనం చేసుకుంది. పన్నూన్ మీద పంజాబ్‌ల
22 క్రిమినల్ కేసులున్నాయి. వాటిలో మూడు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి.
ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూమి, అమృతసర్
జిల్లాలోని ఖాన్‌కోట్ గ్రామంలో ఉంది. చండీగఢ్ నగరంలో సెక్టార్ 15సిలో ఉన్న ఇంటిని
కూడా సీజ్ చేసారు. దీంతో పన్నూన్ ఆ ఆస్తిపై హక్కులు కోల్పోయాడు. 2020లో ప్రభుత్వం
ఆ ఆస్తులను అటాచ్ చేసింది, ఇప్పుడు జప్తు చేసుకుంది.
‘‘దేశంలో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని
ప్రోత్సహించే నెట్‌వర్క్ కెనడా సహా పలుదేశాల నుంచి పని చేస్తోంది. పన్నూన్ ఆస్తుల స్వాధీనం
ద్వారా అటువంటి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నాము’’ అని ఎన్ఐఏ ఒక
ప్రకటనలో వెల్లడించింది.
పన్నూన్ ఇటీవలే కెనడాలో ఉన్న భారతీయ హిందువులను ఆ
దేశం వదిలి తిరిగి స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ బెదిరించాడు. ఈమధ్య వైరల్ అయిన ఒక
వీడియోలో గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కెనడాలోని హిందువులను ‘‘మీరు కెనడా ప్రభుత్వాన్నీ,
రాజ్యాంగాన్నీ నిరాకరిస్తున్నారు. మీ లక్ష్యం భారత్. కెనడాను వదిలిపెట్టి భారత్‌కు
వెళ్ళిపోండి’’ అని బెదిరింపు ధోరణిలో హెచ్చరించాడు. ‘‘ఖలిస్తాన్ అనుకూల సిక్కులు
ఎప్పుడూ కెనడాకు విధేయంగా ఉన్నారు. వారు కెనడియన్ రాజ్యాంగాన్నీ, చట్టాలనూ
గౌరవిస్తారు’’ అని ప్రకటించాడు. జూన్ నెలలో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు
భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మదే బాధ్యత అనే విషయంపై వచ్చే అక్టోబర్ 29న
వాంకూవర్‌లో సిక్కులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతానని ప్రకటించాడు.
భారత ప్రభుత్వం 2020
జులైలో పన్నూన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతన్ని పట్టుకోడానికి రెడ్ నోటీస్ జారీ
చేయాలని ఇంటర్‌పోల్‌ను అభ్యర్ధించింది. అయితే, తగినంత సమాచారం లేదన్న కారణంతో భారత
అభ్యర్ధనను ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది. ఎన్ఐఏ పన్నూన్‌పై మొదటిసారి కేసు
పెట్టిన 2019 నుంచీ అతని గురించి అన్వేషిస్తోంది. 2021లో ఎన్ఐఏ కోర్టు
నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.