వారణాసిలో
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. తాను
ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో
పర్యటించిన ప్రధాని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆధునిక
సౌకర్యాలతో స్టేడియాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
శంకుస్థాపన
కార్యక్రమానికి క్రికెట్ ప్రముఖులు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, బీసీసీఐ
కార్యదర్శి జై షా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీశ్ శుక్లా హాజరయ్యారు. ప్రధానికి నమో
అని రాసి ఉన్న టీషర్ట్ ను సచిన్ అందజేశారు.
రూ.
450 కోట్లతో 30 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ముప్పై వేల మంది ఆటను చూసేలా ఈ
స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 30 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా
పెట్టుకున్నారు.
భూమి సేకరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 121 కోట్లు ఖర్చు చేస్తుండగా,
బీసీసీఐ రూ. 331 కోట్లు వెచ్చించనుంది.
శివతత్వం ఉట్టిపడే డిజైన్తో నిర్మిస్తున్న ఈ
స్టేడియాన్ని మహాదేవుడికే అంకితం చేయనున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ, ఈ స్టేడియం స్థానిక క్రీడాకారులకు ఎంతో
ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పూర్వాంచల్ ప్రాంతానికి తలమానికంగా ఉంటుందని
చెప్పారు.
కాశీ
విశ్వేశ్వరుడి స్ఫూర్తితో ఈ స్టేడియాన్ని డిజైన్ చేశారు. అర్ధచంద్రాకారంలో రూఫ్
కవర్, త్రిశూలం తరహాలో ఫ్లడ్ లైట్లు, ఘాట్ మెట్లును తలపించేలా సీటింగ్ ఏర్పాట్లు
చేస్తున్నారు.