అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమనీ, ఆ
రాష్ట్రాన్ని తమ భూభాగంగా చూపించుకోడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవనీ అసోం
శాసనసభ డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పష్టం చేసారు. ‘‘అరుణాచల్ ప్రదేశ్ ఎట్టి
పరిస్థితుల్లోనూ భారతదేశంలోనే ఉంటుంది. ఈశాన్య భారత ప్రజలు అరుణాచల్ ప్రదేశ్కు
అండగా నిలుస్తారు. కాబట్టి చైనా దుష్ట పన్నాగాలు ఏమాత్రం విజయం సాధించలేవు’’ అని
మోమిన్ చెప్పారు. చైనా బెదిరింపులను నరేంద్ర మోదీ ప్రభుత్వం సమర్ధంగా
ఎదుర్కొంటుందని నుమాల్ మోమిన్ ధీమా వ్యక్తం చేసారు.
చైనాలో జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో
పాల్గొనడానికి మనదేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒనిలు తేగా,
మేపుంగ్ లాంగూ అనే ఇద్దరు ‘వుషు’ క్రీడాకారులు ఎంపికయ్యారు. హాంగ్జౌ ఆసియన్
గేమ్స్ 2023 ఆర్గనైజింగ్ కమిటీ, వారికి ఆమోద ముద్ర వేసింది. అయితే వారు చైనాలోకి
ప్రవేశించడానికి అవసరమైన అక్రెడిషన్ కార్డులు మాత్రం తీసుకోలేకపోయారు. మరో అథ్లెట్
న్యేమన్ వాంగ్సూకు అక్రెడిషన్ కార్డు డౌన్లోడ్ అయింది కానీ ఆమె హాంకాంగ్ దాటి
ప్రయాణించకూడదని ఆంక్షలు విధించారు.
అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాలు,
అక్రెడిషన్ కార్డులు ఇవ్వకుండా వారిని భారత్ తరఫున ఆడనీయకుండా నిలువరిస్తున్న చైనా
ధోరణికి నిరసనగా భారత క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు
చేసుకున్నారు.
‘‘చైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా అరుణాచల్
ప్రదేశ్ నుంచి వెళ్ళిన భారత క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని వారిపట్ల
వివక్షాపూరితంగా ప్రవర్తిస్తున్నట్టు, చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా
క్రీడల్లో పాల్గొనకుండా నిలువరించినట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. తమ క్రీడాకారుల
పట్ల ఇటువంటి వైఖరిని భారత్ ఖండిస్తోంది’’ అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీ, కేంద్ర మంత్రి
అయిన కిరెన్ రిజిజు, చైనా దుందుడుకు ధోరణిని దుయ్యబట్టారు. భారత క్రీడాకారులకు
సాధారణ వీసాలు ఇవ్వడానికి నిరాకరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘‘క్రీడాకారులను
రానీయకుండా ఆపివేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఆసియన్ గేమ్స్ నిర్వహణకు సంబంధించిన
నియమావళికి సైతం వ్యతిరేకం. ఆసియా సభ్యదేశాల నుంచి పోటీకి వచ్చే క్రీడాకారుల పట్ల
వివక్ష చూపించడాన్ని ఆసియా క్రీడల నియమావళి నిషేధించింది’’ అని రిజిజు గుర్తు
చేసారు.
‘‘అరుణాచల్
ప్రదేశ్ వివాదాస్పద భూభాగం కాదు, అది భారతదేశం నుంచి విడదీయలేని అంతర్భాగం.
అరుణాచల్ తమదే, అక్కడి ప్రజలు తమవారే అంటూ చైనా చేస్తున్న అక్రమ ప్రకటనలను రాష్ట్ర
ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.
చైనా చట్టవిరుద్ధ చర్యలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జోక్యం చేసుకోవాలి’’ అని
కిరెన్ రిజిజు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.