స్కిల్
డెవలప్మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు సుప్రీంకోర్టును
ఆశ్రయించారు. హైకోర్టు కొట్టివేసిన క్వాష్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో ఆయన
తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో ప్రధాన కుట్రదారుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనంటూ
సీఐడీ ఆరోపిస్తోంది. మరింత లోతైన విచారణలో భాగంగా ఆయనను అరెస్టు చేశారు. అరెస్టును
సమర్థించిన ఏసీబీ న్యాయస్థానం జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు తరఫు
న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ను డిస్మిస్
చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
సీఐడీ విచారణ తుది దశలో ఉన్నందున క్వాష్
చేయలేమని పిటిషన్ను తోసిపుచ్చింది. సెక్షన్ 482కింద మినీ ట్రయల్ నిర్వహించలేమని
హైకోర్టు పేర్కొంది.
హైకోర్టు
తీర్పును చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో క్వాష్ పిటిషన్
కాపీ అందజేశారు. సోమవారం పిటిషన్ను స్వీకరించే అవకాశముంది.
హైకోర్టులో
క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమాహేమీలైన న్యాయవాదులు వాదనలు వినిపించారు.
చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే వాదించగా, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ
వకాల్తా పుచ్చుకున్నారు.