దేశవ్యాప్తంగా
విఘ్నేశ్వరుడి నవరాత్రులు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వివిధ ఆకారాల్లో గణేశుడి
ప్రతిమలను ప్రతిష్టించి ఆరాధిస్తున్నారు. మతాలకు అతీతంగా పార్వతీపుత్రుడి
నవరాత్రులు నిర్వహిస్తున్నారు. భారీ సైజుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తి
చాటుకుంటున్నారు.
పట్టణాలు, గ్రామాలనే తారతమ్యాలు లేకుండా కూడళ్లతో పాటు కార్యాలయాలు,
ప్రముఖ ఆలయాల్లో గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేసిర రంగరంగ వైభవంగా ఉత్సవాలు
చేస్తున్నారు. నోట్ల కట్టలతో కొందరు
స్వామికి మాల వేస్తే మరికొందరు డ్రై ఫ్రూట్స్, మొక్కలతో అలంకరిస్తున్నారు.చంద్రయాన్-3
నమూనాతో ఏర్పాటు చేసిన విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
గుజరాత్ లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్
అసోదరియా వజ్ర గణపతిని నవరాత్రుల సందర్భంగా ఆరాధిస్తున్నారు. 182.3 క్యారెట్లతో
36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు.
ఆ రోజున ఇతర భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తారు. మార్కెట్లో దీని విలువ సుమారు
రూ. 600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
పదిహేనేళ్ళ
క్రిందట బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు కొనుగోలు చేసి
భారత్ కు తీసుకొచ్చారు. అందులో ఓ వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు తన తండ్రికి కల
వచ్చిందని, దాంతో వజ్రాలు పరిశీలించగా సహజసిద్ధంగా ఏర్పడిన వజ్ర గణపతి కనిపించాడని
చెబుతున్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు
చేస్తున్నట్లు కనుభాయ్ చెప్పారు.