అమెరికా కనుక ఒకవేళ భారత్, కెనడాల్లో ఏదో ఒకదేశాన్నే ఎంచుకోవలసి వస్తే…
తప్పకుండా భారతదేశాన్నే ఎంచుకుంటుంది అని పెంటగన్ మాజీ అధికారి ఒకరు స్పష్టం
చేసారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్ మీద చేసిన ఆరోపణల వల్ల భారతదేశం
కంటె కెనడాకే ఎక్కువ ప్రమాదం కలుగుతుందని పెంటగన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్
వ్యాఖ్యానించారు. అమెరికాకు కెనడాతో కంటె భారతదేశంతో సంబంధాలే ఎక్కువ ప్రధానమని
ఆయన కుండ బద్దలుకొట్టారు.
అమెరికాకు భారతదేశమే వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్య
దేశమని రూబిన్ అన్నారు. కెనడా భారతదేశంతో గొడవపడడం, చీమ ఏనుగుతో తలపడినట్లేనని
వ్యాఖ్యానించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అంతర్జాతీయంగా అతితక్కువ
ఆమోదనీయత లభిస్తుండడాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ఎక్కువ కాలం ప్రధానిగా ఉండలేరనీ,
ట్రూడో గద్దె దిగాక అమెరికా కెనడాతో సంబంధాలను పునర్నిర్మించుకుంటుందనీ
వ్యాఖ్యానించారు.
‘‘నా ఉద్దేశంలో ప్రధాని ట్రూడో చాలా పెద్ద తప్పు
చేసారు. ఆయన భారత్‌పై ఆరోపణలు ఎలా చేసారంటే, వాటి నుంచి వెనక్కు మళ్ళడం ఆయనకు
సాధ్యం కాదు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలూ
లేవు. అసలు తన ప్రభుత్వం ఒక ఉగ్రవాదికి ఎందుకు ఆశ్రయం కల్పించిందో ఆయన చెప్పాల్సి
ఉంది’’ అన్నారు మైకేల్ రూబిన్. భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్
నిజ్జర్, జూన్ 18న కెనడాలోని సర్రే ప్రాంతంలో ఒక గురుద్వారా బైట కాల్పుల్లో ప్రాణాలు
కోల్పోయాడు. ఆ ఘటనపైనే కెనడా ప్రధాని ట్రూడో భారతదేశంపై ఆరోపణలు చేసారు.
‘‘భారత్-కెనడా వ్యవహారంలో అమెరికా ఏదో ఒక వైఖరి
తీసుకుంటుందని అనుకోను. కానీ, ఇద్దరు స్నేహితుల్లో ఒకరినే ఎంచుకోక తప్పదనే పరిస్థితి
వస్తే, అమెరికా భారత్ పక్షమే ఉంటుంది. కారణం చాలా సింపుల్. నిజ్జర్ ఒక ఉగ్రవాది.
అతనికోసం భారత్ లాంటి దేశాన్ని వదులుకోలేం. అమెరికాకు భారత్‌తో సంబంధాలు చాలా
ముఖ్యం’’ అని స్పష్టం చేసారు రూబెన్.
‘‘నిఘా విభాగంలో పనిచేసిన వ్యక్తిగా నేను చెప్పగలిగేది
ఏంటంటే నిఘా వ్యవస్థల్లో మనకు వచ్చే సమాచారం అన్నిసార్లూ తప్పు లేదా ఒప్పు అని
నేరుగా నిర్ధారించగలిగేలా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితినే చూస్తే ప్రధాని ట్రూడో
చేసిన ఆరోపణల మీద ఏకాభిప్రాయానికి రావడం కుదరదు. పైగా మనం ఒక విషయాన్ని స్పష్టంగా
గుర్తించాలి. నిజ్జర్ కేవలం ఒక ప్లంబర్ మాత్రమే కాదు. లాడెన్ కూడా ఒక ఇంజనీరే.
కానీ అతని చేతులు రక్తంతో తడిసినవి. నిజ్జర్ కూడా అలాంటివాడే’’ అని రూబెన్
విశ్లేషించారు.
భారత్ కెనడా వ్యవహారంలో అమెరికా నేరుగా స్పందించే
అవకాశముందా అన్న ప్రశ్నకు రూబెన్ స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే భారత్ కంటె
కెనడాకే ఎక్కువ ప్రమాదం పొంచివుంది. కెనడా ఇప్పుడు కనుక భారత్‌తో యుద్ధానికి
దిగితే, అది ఒక చీమ ఏనుగుతో తలపడినట్టే ఉంటుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద
ప్రజాస్వామ్య దేశం. వ్యూహాత్మకంగా కూడా కెనడా కంటె భారతదేశమే ప్రధానమైనది. ప్రత్యేకించి
హిందూ మహాసముద్రం పరిధిలో చైనా వల్ల ఆందోళనలు పెరుగుతున్న ఈ సమయంలో భారతదేశానికే వ్యూహాత్మకంగా
అత్యంత ప్రాధాన్యం ఉంది’’ అని వివరించారు.
జస్టిన్ ట్రూడోకు దూరదృష్టి లేదనీ, ఆయన ఫక్తు రాజకీయ
నాయకుడిలా ప్రవర్తిస్తున్నారనీ రూబెన్ అభిప్రాయపడ్డారు. ట్రూడో కేవలం కెనడా
రాజకీయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తే
ట్రూడో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కెనడాలోని చాలా నియోజకవర్గాల్లో సిక్కులు
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరు. అందుకే వారి మెప్పుకోసం ట్రూడో
ప్రయత్నిస్తున్నారు. కానీ, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బతీసుకోవడం సరైన పద్ధతి
కాదు’’ అని రూబెన్ విశ్లేషించారు.