స్కిల్
డెవలప్మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అధికారులు
కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయమే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి
చేరుకున్న సీఐడీ అధికారులు, చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించారు అల్పాహారం
తీసుకుని మందులు వేసుకున్న తర్వాత కోర్టు ఆదేశించిన సమయానికి కస్టడీలోకి తీసుకుని
విచారణ ప్రారంభించారు.
జైలులోని కాన్ఫరెన్స్ హాల్ లో విచారణ చేస్తున్నారు.
12
మంది సభ్యుల సీఐడీ బృందం చంద్రబాబును విచారిస్తోంది. న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో
విచారణ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగనుంది. ప్రతి గంటకూ ఐదు నిమిషాలు విరామం ప్రకటించడంతో పాటు మధ్యాహ్నం
ఒంటి గంటకు భోజన విరామం ఉంటుంది.
సీఐడీ
డీఎస్పీ ధనుంజయనాయుడు నేతృత్వంలో విచారణ జరుగుతోంది. విజయభాస్కర్(డిప్యూటీ ఎస్పీ),
లక్ష్మీనారాయణ (డిప్యూటీ ఎస్పీ), ఇన్స్పెక్టర్లు మెహన్ కుమార్, రవి కుమార్,
శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో
పాటు విచారణను రికార్డు చేసేందుకు ఫ్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లు ఉంటారు.
విచారణ నివేదకను సీల్డ్
కవర్ లో న్యాయస్థానానికి నివేదించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా
చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి
స్పష్టం చేశారు.