కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వివాదాస్పద
వ్యాఖ్యలు చేయడం ఆపడం లేదు. కెనడాలో స్థిరపడిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారని కొన్నిరోజుల క్రితం తమ దేశపు
పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కెనడా ప్రధాని, ఆ అగ్నిలో తాజాగా మరింత ఆజ్యం
పోసారు. నిజ్జర్ హత్య గురించి తమ ఆరోపణలను భారతదేశంతో కొన్ని వారాల క్రితమే పంచుకున్నామని
ఇవాళ ప్రకటించారు.
‘‘సోమవారం నేను చేసిన విశ్వసనీయ ఆరోపణల గురించి
సమాచారాన్ని కెనడా భారత్‌తో పంచుకుంది. భారత ఏజెంట్ల పాత్ర గురించి మేం ఆ దేశపు
ప్రభుత్వానికి కొన్ని వారాల క్రితమే చెప్పాము. మేం భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా
పనిచేయాలనుకుంటున్నాము. తీవ్రమైన ఈ అంశాన్ని ఎదుర్కోడంలో భారత్ మాతో కలిసి
వస్తుందని ఆశిస్తున్నాము’’ అని ట్రూడో శనివారంనాటి ఒక మీడియా సమావేశంలో
చెప్పుకొచ్చారు.
భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్
నిజ్జర్ హత్య గురించి ట్రూడో గత సోమవారం తమ దేశపు పార్లమెంటులో మాట్లాడారు.
నిజ్జర్‌ను కెనడా దేశపు అమాయకమైన పౌరుడిగా చెబుతూ భారత ప్రభుత్వపు ఏజెంట్లే అతన్ని
హత్య చేసినట్టు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ప్రకటించారు. భారతదేశం ఆ ప్రకటనను
వెంటనే ఖండించింది. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన
సమాచారాన్నీ కెనడా భారత్‌తో పంచుకోలేదని మన ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి
ప్రకటనలు కెనడాలో భారతీయులే లక్ష్యంగా ద్వేష నేరాలకు, హింసాకాండకూ దారితీస్తుందని ఆందోళన
వ్యక్తం చేసింది.
ట్రూడో ఆరోపణలు రెండు దేశాల మధ్యా దౌత్య
ఉద్రిక్తతలను పెంచాయి. భారత దౌత్యాధికారి ఒకరిని కెనడా తమ దేశం నుంచి
బహిష్కరించింది. దాంతో భారతదేశం కూడా వెంటనే మన దేశంలో ఉన్న కెనడియన్
దౌత్యాధికారిపై వేటు వేసింది. ఇరుదేశాలూ ఎదుటి దేశానికి చేసే ప్రయాణాలపై ఆంక్షలు
విధించాయి. కెనడాలో భారత వ్యతిరేక చర్యలు జరుగుతున్నందున అక్కడున్న భారతీయులు
జాగ్రత్తగా ఉండాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరించింది. కెనడా కేంద్రంగా కొందరు ప్రజలు
భారతదేశంలో పాల్పడుతున్న నేరాలకు సంబంధించి ఆధారాలు ఇచ్చినప్పటికీ ఆ దేశం చర్యలు
తీసుకోవడం లేదని భారత్ ఆరోపించింది. అలాంటి భారత వ్యతిరేక శక్తులకు కెనడా రాజకీయ
నాయకులు బహిరంగంగానే సానుభూతి చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ
బ్లింకెన్, కెనడాకు సహకరించాలని భారత్‌కు ఉచిత సలహా ఇచ్చారు. తాము రెండు దేశాలతోనూ
టచ్‌లో ఉన్నామన్నారు బ్లింకెన్. ‘‘మేము (భారత్ నుంచి) జవాబుదారీతనం
కోరుకుంటున్నాము. దర్యాప్తు స్వేచ్ఛగా జరగడం ముఖ్యం. అప్పుడే కేసులో ఫలితం
కనిపిస్తుంది’’ అని చెప్పారు.
పంజాబ్‌ను భారతదేశం నుంచి
విడదీసి ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయాలన్న సిక్కు వేర్పాటువాదులు కెనడా
కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. సిక్కు వేర్పాటువాదుల పార్టీ మద్దతుతో ట్రూడో
ప్రభుత్వం నడుస్తోంది. వారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన ట్రూడో, భారత్‌తో
వివాదాలకు పదేపదే కాలుదువ్వుతున్నారు.