తిరుమల
శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఆరోరోజు ఈ ఉదయం శ్రీమలయప్ప స్వామి భక్తులను
హనుమంత వాహనంపై నుంచి కటాక్షించారు. స్వామి ఊరేగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన
భజనలు, కోలాటాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు మైమరచిపోయారు.
ఈ
రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి
స్వర్ణరథంపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. మహిళా భక్తులే స్వర్ణరథం లాగనుండటం ఈ
సేవ విశేషం. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహన సేవలు జరుగుతాయని తిరుమల
తిరుపతి దేవస్థానం పాలకమండలి తెలిపింది.
శుక్రవారం
రాత్రి దేవదేవుడు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. రాత్రి
7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సేవ కొనసాగింది.
విశిష్టమైన గరుడోత్సవంలో
మూలమూర్తికి అలంకరించే ఆభరణాలు మలయప్పస్వామికి ధరింపజేశారు. చెన్నై నుంచి దాతలు
అందజేసిన నూతన ఛత్రాలను స్వామి ఊరేగింపు కార్యక్రమంలో ఉపయోగించారు.
తిరుమలలో బ్రహ్మోత్సవ పర్వదినాలతో పాటు శనివారం కావడంతో
భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఏడుకొండల వాడి దర్శనం కోసం భక్తులు 30
కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం గరుడ సేవ సందర్భంగా శ్రీవారిని 72,650
మంది దర్శించుకోగా, హుండీ ద్వారా స్వామికి రూ.3.33 కోట్లు సమర్పించారు.