చంద్రయాన్-3 మిషన్ రెండో దశ మరికొన్ని గంటల్లో
ప్రారంభమయే అవకాశాలున్నాయి. చంద్రుడి ఉపరితలం మీద అత్యంత శీతల పరిస్థితులు
ఉన్నప్పటికీ చంద్రయాన్ వ్యవస్థలు మళ్ళీ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇస్రో
మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ భావిస్తున్నారు.
‘‘విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ సుమారు రెండు వారాల నుంచి ప్రగాఢ
నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని వినియోగంలోకి తీసుకురావడమంటే, ఏదైనా
వస్తువును డీప్ ఫ్రీజర్ నుంచి బైటకు తీసి వాడుకోడానికి ప్రయత్నించినట్లే. అక్కడ
ఉష్ణోగ్రతలు మైనస్ 150 డిగ్రీల సెల్సియస్ కంటె తక్కువగా ఉన్నాయి’’ అని మాధవన్
నాయర్ వివరించారు.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి
చేసిన తర్వాత చంద్రతలం మీద నిద్రాణస్థితిలోకి చేరుకున్నాయి. ఇప్పుడు వాటిని నిద్ర
నుంచి లేపడానికి ఇస్రో సిద్ధపడుతోంది.
‘‘అలాంటి ఉష్ణోగ్రతల దగ్గర బ్యాటరీలు,
ఎలక్ట్రానిక్స్, వాటి మెకానిజం మనుగడలో ఉండడమన్నది పెద్ద సమస్య. అలాంటి
పరిస్థితుల్లో కూడా అవి పనిచేయగలవని స్పష్టం చేయడానికి అవసరమైన పరీక్షలు ముందే నిర్వహించారు.
అయినప్పటికీ, అవి పనిచేస్తాయో లేదో తెలవడానికి మనం వేచి చూడాల్సిందే’’ అని మాధవన్
నాయర్ చెప్పారు.
‘‘చంద్రుడి మీద సూర్యకాంతి పడినప్పుడు
ఆ వేడికి పరికరాలు వార్మప్ అవాలి, బ్యాటరీలు రీచార్జ్ అవాలి. ఆ రెండు ప్రక్రియలూ
విజయవంతంగా పూర్తయితే, వ్యవస్థ మళ్ళీ పని చేయడానికి మంచి అవకాశముంది’’ అని
వివరించారు. ల్యాండర్, రోవర్ విజయవంతంగా యాక్టివేట్ అయితే, చంద్రతలం నుంచి మరింత
సమాచారాన్ని సేకరించవచ్చని చెప్పారు. ‘‘ల్యాండర్, రోవర్ మళ్ళీ పనిచేయడం
మొదలైతే, మరో 14 రోజుల పాటు రోవర్‌ను మరికొంత దూరం ప్రయాణింపజేయవచ్చు. చంద్రుడి దక్షిణ
ధ్రువం మీద ఉపరితలం పరిస్థితుల గురించి మరింత సమాచారం సేకరించవచ్చు’’ అని నాయర్
చెప్పారు.
మరో మాజీ శాస్త్రవేత్త తపన్ మిశ్రా ‘రోవర్
నిద్రాణ స్థితి నుంచి లేవలేకపోయినా, ల్యాండర్ ఒక్కటీ పనిచేసినా అది కూడా అద్భుతమే’
అని వ్యాఖ్యానించారు. ‘‘చంద్రయాన్ ల్యాండర్, రోవర్ కేవలం 14 రోజులు పనిచేసేలా
మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఉష్ణోగ్రతలు మైనస్ 140
నుంచి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతాయి. ఆ ఉష్ణోగ్రతల దగ్గర ఏ
ప్లాస్టిక్ పదార్ధం, ఏ కార్బన్ పవర్ మెటీరియల్ లేదా ఏ ఎలక్ట్రానిక్ పదార్ధమూ
ఉండలేవు. అవి పగుళ్ళు వచ్చేస్తాయి. అయితే, థర్మల్ మేనేజ్మెంట్కు ఇస్రో అన్నిరకాల
ప్రయత్నాలూ చేసే ఉంటుంది’’ అని తపన్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
‘‘ఇస్రో వాళ్ళ థర్మల్ మేనేజ్మెంట్ విజయవంతమైతే,
ఇస్రో డిజైన్లు విజయవంతమైతే, చంద్రుడి ఉపరితలం మీద పగలు ప్రారంభమైనప్పుడు
ల్యాండర్, రోవర్లలోని పేలోడ్స్ అన్నీ పని చేసే అవకాశముంది. రోవర్ పనిచేయకుండా
కేవలం ల్యాండరే పనిచేసినా, అదీ అద్భుతమే’’ అన్నారు.
ల్యాండర్, రోవర్ చంద్రుడి మీద ఒక రాత్రిని
తట్టుకుని మేలుకుని పనిచేయగలిగితే, అవి మరిన్ని చంద్రరాత్రులను తట్టుకోగలుగుతాయని మిశ్రా ధీమా వ్యక్తం చేసారు. ‘‘అదే సాధ్యమైతే
మనం సంవత్సరం పొడుగునా చంద్రుడి మీద ల్యాండర్‌ను, రోవర్‌ను పనిచేయించవచ్చు. అవి ఒక
చంద్రరాత్రిని తట్టుకుని ఉండగలిగితే కనీసం ఆరు నెలల నుంచి ఏడాదిపని చేసే అవకాశముంది. అదే జరిగితే చాలా గొప్ప
విజయమే’’ అని మిశ్రా అన్నారు.
తరువాత ముఖ్యమైన విషయం నీటి ఉనికిని
ధ్రువీకరించడమేనని తపన్ మిశ్రా చెప్పారు. ‘‘అందులో ఒక స్పెక్ట్రోస్కోపీ పరికరం
ఉంది. చంద్రతలం మీద ఉన్న లోహాలు అన్నింటినీ అది మనకు చూపించింది. అక్కడ ఆక్సిజన్
ఉనికిని కూడా చూపించింది. అయితే మనం చూస్తున్నది నీటి కోసం. విశ్వంలో రాళ్ళు
ఉన్నాయంటే అక్కడ సిలికాన్ పదార్ధం ఏదో ఒకటి ఉన్నట్టు లెక్క. అలాంటి సిలికాన్
పదార్ధం నుంచి ఆక్సిజన్ విడుదల కావచ్చు. లేదా నీటి నుంచి ఆక్సిజన్ వచ్చి ఉండవచ్చు.
అయితే అక్కడ హైడ్రోజన్ ఉనికిని కనుగొనగలిగితే…. అది నీటి ఉనికికి కచ్చితమైన
నిరూపణ అవుతుంది. ఎందుకంటే హైడ్రోజన్ నీటిలో తప్ప మరే ఇతర పదార్ధంలో ఉండదు. మనం
ఇదివరకు రిమోట్ సెన్సింగ్ విధానంలో నీటి ఉనికిని గుర్తించాం, ఇక దాన్ని భౌతికంగా
చూపించాలి’’ అని తపన్ మిశ్రా వివరించారు.