అసెంబ్లీ
సమావేశాల రెండోరోజూ గందరగోళంతోనే ప్రారంభమైంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు
చేశారంటూ మొదటి రోజు నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు రెండోరోజూ కొనసాగించారు.
దీంతో తెలుగుదేశం శాసనసభ్యుల ప్రవర్తనపై స్పీకర్ సహా అధికారపార్టీ సభ్యులు
అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
అసెంబ్లీ
రెండోరోజు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలకు స్పీకర్ సమయం కేటాయించారు. అయితే సభ
మొదలవ్వగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, సభా కార్యక్రమాలకు
అవాంతరం కల్పించారు.
టీడీపీ
ఎమ్మెల్యేల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ
సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని సూచించారు. మరో మంత్రి అంబటి రాంబాబు
మాట్లాడుతూ శాసనసభలో అనవసర పదాలు ఉపయోగిస్తే సహించేది లేదన్నారు. సీఎంను
ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. అయినా టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించడంతో
పాటు స్పీకర్ చైర్ ను చుట్టిముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. దీంతో సభను 10
నిమిషాలు వాయిదా వేశారు.
వాయిదా అనంతరం 9.40 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది.
మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నాడన్నారు.
కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నాడని విమర్శించారు. చర్చ జరుగుతుండగా హిందూపురం
ఎమ్మెల్యే బాలకృష్ణ తన సీటుపైకి ఎక్కి విజిల్ వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు
అచ్చెన్నాయుడు, అశోక్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
అసెంబ్లీలో
టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం
చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు విజిల్స్ వేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తమ
అధినేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ కోరినప్పటికీ
టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడు, గోరంట్ల
బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణ ను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
అనంతరం
స్కిల్ స్కాంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు
అరెస్టుకు కారణాలు వివరించారు.
చంద్రబాబు
కుదుర్చుకుంది చీకటి ఒప్పందమని చెప్పిన మాజీమంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు,
మంత్రివర్గంలో ఆమోదించిన దానికి భిన్నంగా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. పక్కా
ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కామ్ జరిగిందని, సెక్రటేరియట్‌లోని నోట్ ఫైళ్ళు మొత్తం
మాయం చేశారన్నారు.
విజనరీ
అనే చెప్పుకుని చంద్రబాబు, ఇప్పుడు ప్రిజనరీగా మారారని ఈ కేసులో ఇప్పటి వరకు 17
మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు
10 మందిని అరెస్టు చేశారని ఏడుగురు బెయిల్ పై బయటకు వచ్చారని వివరించారు. బెయిల్
మీద వచ్చిన సుమన్ బోస్‌కు చంద్రబాబు మద్దతు పలకడం విడ్డూరమన్నారు.