స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. సీఐడీ కస్టడీపై కూడా న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాలు తీసుకున్నారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తన హక్కులను కాపాడాలని ఆయన జడ్జిని కోరారు. ఈ నెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ పూర్తి చేసింది. ఇవాళ తీర్పును వెలువరించే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించాలంటూ తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడి వేసిన పిటిషన్‌పై కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.