తిరుమలలో
శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు స్వామివారు
మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో బంగారుపల్లకిపై
విహరించి భక్తులను అనుగ్రహించారు. గోవింద నామస్మరణతో తిరుమలేశుడి సన్నధి
మార్మోగుతోంది.
సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో కోనేటిరాయుడి కోవెల కోలాహలంగా
ఉంది.
రాత్రి
7 గంటలకు శ్రీవారి గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. గరుడోత్సవం అంత్యంత
విశిష్టమైనది కావడంతో భక్తుల అధిక సంఖ్యలో వస్తారని అధికారులు భావిస్తున్నారు.
అందుకు తగినట్లు భారీ భద్రతా ఏర్పాట్లుచేశారు.
తిరుమల
వేంకటేశ్వరస్వామికి నిర్వహించే గరుడ సేవ అత్యంత విశిష్టమైనది. ఉత్సవాల ఆరంభం సందర్భంగా
గరుడధ్వజాన్ని ఎగురవేయడం, అయిదో రోజు గరుడవాహనంపై ఆ గజరాజ రక్షకుడిని ఊరేగించటం,
పరిసమాప్తి రోజున గరుడధ్వజం అవరోహణ చేయడం అనవాయితీగా వస్తోంది.
గరుడ
సేవ సందర్భంగా స్వామివారికి గోదాదేవి బహూకరించిన తులసిహారాలు అలంకరిస్తారు.
మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని గరుడవాహన సేవ
రోజున మలయప్పస్వామికి అలంకరణ చేస్తారు.
గురువారం
రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు
దర్శనమిచ్చారు. స్వామివారి సేవ కోలాహలంగా జరిగింది. ఈ సేవలో పాల్గొన్న వారికి
యశోప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వభూపాల అంటే అందరు రాజులు
అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.
తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు
అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా
వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ ద్వారా
తెలుసుకోవచ్చు.