చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గురువారం మహిళా బిల్లుపై రాజ్యసభలో 11 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది.214 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. నిబంధన మేరకు ఓటింగ్ నిర్వహించారు. సభను అనుకున్నదానికన్నా ఒక రోజు ముందుగానే నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు.
మహిళా బిల్లుకు ఆమోదం తెలిపిన సభ్యులందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. జన గణన, డీలిమిటేషన్ల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసురావాలని అధికార బీజేపీ భావిస్తోంది. లోక్‌సభలో మహిళా బిల్లు ఇప్పటికే ఆమోదం పొందడంతో 128వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం కేంద్ర న్యాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
రెండు సభల్లో బిల్లులు ఆమోదం పొందడంతో తదుపరి ప్రక్రియలను చేపట్టాల్సి ఉంది. 2024 ఎన్నికల తరవాత జనగణన చేపట్టడం, డీలిమిటేషన్ ప్రక్రియలను పూర్తి చేసి ఆ తరవాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటన చేశారు.