పాకిస్తాన్ ఎన్నికలు 2024 జనవరి నెల ఆఖరి
వారంలో జరుగుతాయని ఆ దేశపు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు సీట్ల కేటాయింపును
పరీక్షించినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ
పురోగతిని సమీక్షించిన తర్వాత వాటి ప్రాథమిక జాబితాను సెప్టెంబర్ 27న ప్రకటించాలని
ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి
పరిష్కరించిన తర్వాత నియోజకవర్గాల తుదిజాబితా నవంబర్ 30న ప్రకటిస్తారు.
తర్వాత 54 రోజుల వ్యవధిలో ఎన్నికలు
నిర్వహిస్తారు. ఆ లెక్కన ఓటింగ్ ప్రక్రియ 2024 జనవరి ఆఖరి వారంలో జరుగుతుంది.
పాకిస్తాన్ సాధారణ ఎన్నికల నిర్వహణకు
తేదీలు నిర్ణయించే అంశం గురించి, దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆగస్టు నెలలో ఎన్నికల
ప్రధాన కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజాతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ నేషనల్
అసెంబ్లీ రద్దయిన నాటినుంచి 90 రోజుల వ్యవధిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని
ఆయనకు చెప్పారు.
అయితే, పాక్ ఎన్నికల
చట్టానికి తాజాగా చేసిన సవరణ, దేశాధ్యక్షుడిని సంప్రదించకుండానే ఎన్నికల తేదీలను
ప్రకటించడానికి ఎలక్షన్ కమిషనర్‌కు అధికారం ఇచ్చింది.
ఆగస్ట్ నెలలో పాకిస్తాన్ నేషనల్
అసెంబ్లీ రద్దయిన తర్వాత అన్వరుల్ హక్ కాకర్, పాక్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా
బాధ్యతలు స్వీకరించారు.