స్కిల్ స్కామ్ కేసులో రిమాండులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడును విచారించడానికి తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడి వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసును మంగళవారం, బుధవారంనాడు విచారించిన కోర్టు తీర్పును ముందుగా గురువారం ఉదయానికి వాయిదా వేసింది. మరలా ఇవాళ సాయంత్రం తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు.చివరకు తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై రేపు ఉదయం 11 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కేసు కోట్టివేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో రేపు హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. స్కిల్ స్కామ్‌లో మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడి అధికారులు వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. కస్టడీ పిటిషన్‌పై రేపు ఉదయం తీర్పు వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.