కెనడా, భారత్ మధ్య దౌత్య సమరం ముదురుతున్న
నేపథ్యంలో, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఎలాంటి
సమాచారాన్నీ పంచుకోలేదని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
‘‘కెనడా ఏదైనా నిర్దిష్టమైన సమాచారాన్ని
పంచుకుంటుందేమోనని మేం ఎదురు చూస్తున్నాం. కానీ ఆ దేశం ఇప్పటివరకూ ఎలాంటి
నిర్దిష్టమైన సమాచారాన్నీ మాకు అందించలేదు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
అరిందం బాగ్చీ స్పష్టం చేసారు.
‘‘మా వైపు నుంచి మేము ఇప్పటివరకూ కెనడా భూభాగం
నుంచి కొందరు వ్యక్తులు పాల్పడుతున్న నేరచర్యల గురించి నిర్దిష్టమైన
సాక్ష్యాధారాలను అందజేసాం. వాటిపై ఆ దేశం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ
విషయంలో కెనడా కొంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. కెనడా ప్రభుత్వం
భారత్‌పై ఆరోపణలు చేసింది. అవి రాజకీయ ప్రేరేపితమైనవి అని భావిస్తున్నాం’’ అని
అరిందం చెప్పుకొచ్చారు.
‘‘దౌత్యపరమైన ఉనికిలో సమానత్వం ఉండాలని మేం కెనడా
ప్రభుత్వానికి తెలియజేసాం. కెనడాలోని భారత దౌత్యకార్యాలయాల్లో మన సిబ్బంది కంటె,
మన దేశంలో వారి దౌత్యకార్యాలయ సిబ్బంది ఎక్కువమంది ఉన్నారు. వారి సంఖ్యను
తగ్గిస్తారని భావిస్తున్నాం’’ అని అరిందం బాగ్చీ వివరించారు.
భారత్ ఉగ్రవాదిగా
ప్రకటించిన, కెనడా పౌరసత్వం కలిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత
గూఢచారుల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారంనాడు కెనడా
పార్లమెంటులో ఆరోపణలు చేసారు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. కెనడియన్లకు
వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు వీసా ప్రొవైడర్ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఇవాళ
నిర్ణయం తీసుకుంది.