కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది.దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇక నుంచి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సదుపాయం కోరుకునే వారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ సూచించింది. డిసెంబరులో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరవాత అభ్యర్ధులను ఖరారు చేస్తారు. ఆ తరవాత పోస్టల్ బ్యాలెట్లు కూడా సిద్దం చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈసీ నిర్ణయం దివ్యాంగులకు, నడవలేని వృద్ధులకు చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. అయితే తీవ్రమైన అనారోగ్యాల భారినపడి మంచానికే పరిమితం అయిన రోగులకు కూడా ఇలాంటి సదుపాయం కల్పించాలని మేధావులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.