దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఫోన్లకు గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఎమర్జెన్సీ అలర్ట్ అంటూ ఫ్లాష్ మెసేజ్ రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. అసలు ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. దీంతో మొబైల్ వినియోగదారులు కాసేపు షాక్‌కు గురయ్యారు.
భూకంపాలు, సునామీలు, వరదల్లాంటి ఆకస్మిక విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మెసేజ్‌లను పంపుతుంది. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా మెసేజ్ పంపినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో అలర్ట్ రావడంతో ఫ్లాష్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంగ్లీష్, హిందీలతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ అలర్ట్ పంపించారు. మెసేజ్‌తో పాటు ఆడియో సందేశం కూడా వినిపించింది. ఈ మెసేజ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టెలికమ్యూనికేషన్ విభాగం ప్రకటించింది. ఇది టెస్టింగ్ మెసేజ్ అంటూ తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించడానికి మెసేజ్ పంపారని తెలియడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.