భారతదేశం వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రకటించిన
సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా దునికే, కెనడాలోని వినీపెగ్‌లో హత్యకు గురయ్యాడు.
సెప్టెంబర్ 18న రెండు గ్యాంగ్‌ల మధ్య పోరులో సుఖా దునికే చనిపోయినట్లు సమాచారం,
వినీపెగ్ పోలీసులు ఆరోజు రెండు గ్యాంగ్‌ల మధ్య కాల్పులు జరిగినట్టు
ధ్రువీకరించారు. అయితే ఆ కాల్పుల్లో ఎవరూ చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించలేదు.
వినీపెగ్ పోలీసులు ఎక్స్ సోషల్ మీడియాలో ఒక
ప్రకటన విడుదల చేసారు. ‘‘సెప్టెంబర్ 18, 2023 సాయంత్రం సుమారు 6 గంటల 20 నిమిషాలకు
ఆల్డ్‌గేట్ రోడ్, గోబర్ట్ క్రిసెంట్ ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగినట్టు సమాచారం
వచ్చింది. పెట్రోలింగ్ అధికారులు అక్కడకు వెళ్ళారు. కేసును మేజర్ క్రైమ్స్ యూనిట్ దర్యాప్తు
చేస్తోంది’’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
భారతీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం సుఖా దునికేను
గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. రెండు గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో ఈ హత్య
జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ సుఖా హత్యకు తమదే బాధ్యత అని ఏ గ్యాంగూ
ప్రకటించలేదు.
సుఖా దునికే పంజాబ్‌లోని మోగా జిల్లాలో దేవీందర్
బాంబిహా ముఠాకు చెందిన వాడు. 2017లో భారత్ వదిలిపెట్టి పారిపోయాడు. నకిలీ పత్రాలతో
పాస్‌పోర్ట్ సంపాదించి కొందరు పోలీసుల సహకారంతో దేశం వదిలి పారిపోయాడు. అప్పటికే
అతని మీద పంజాబ్‌లో ఏడు కేసులున్నాయి. సుఖాకు ఖలిస్తానీ అనుకూల సంస్థలతో సంబంధాలు
ఉన్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్‌తో సన్నిహిత
సంబంధాలున్నట్లు సమాచారం.
సుఖా దునికే కాంట్రాక్ట్ హత్యలు చేసేవాడు,
బలవంతపు వసూళ్ళకు పాల్పడేవాడు. పంజాబ్‌తో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో 20కి
పైగా హత్యలు, దోపిడీల వంటి నేరాలకు కేసులు ఎదుర్కొంటున్నాడు. భారతదేశానికి చెందిన
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం విడుదల చేసిన ‘మోస్ట్ వాంటెడ్’ నేరగాళ్ళ
జాబితాలో ఉన్నాడు.