టీడీపీ
అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ శాసనసభలో నిరసన వ్యక్తం
చేసిన ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. సభా
కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు టీడీపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలతో పాటు వైసీసీ
నుంచి బహిష్కరణకు గురైన ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్
ప్రకటించారు.
వైసీపీ నుంచి సస్పెండైన
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రేపల్లె శాసనసభ్యుడు అనగాని
సత్యప్రసాద్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్
చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
శాసనసభ
వర్షకాల సమావేశాల మొదటి రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ
సభ్యులు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ సభ్యులు స్పందించారు. టీడీపీ శాసన
సభ్యులు , కోర్టులో తేల్చుకోవాలని అసెంబ్లీలో కాదంటూ కౌంటర్ ఇచ్చారు.
మంత్రి అంబటి
రాంబాబు, టీడీపీ ఆందోళనను ఉద్దేశించి
మాట్లాడుతూ స్పీకర్ పై దాడి జరిగే అవకాశం ఉందని అదే జరిగితే వైసీపీ సభ్యులు కూడా
ఆగ్రహంతో ఎదురుదాడి చేసే అవకాశం ఉందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంబటి వ్యాఖ్యలపై
ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. మీసం
మెలేసి తొడకొట్టారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం స్పీకర్
సభను కాసేపు వాయిదా వేశారు.
విరామం
తర్వాత అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు చంద్రబాబు
అరెస్టును ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీంతో 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్
చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సభలో బాలకృష్ణ తొడగొట్టడంపై స్పందించిన స్పీకర్,
అలాంటి చర్యలు సరికాదన్నారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం చేయవద్దంటూ
హెచ్చరించారు. అనంతరం సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ఎమ్మెల్యేలను సస్పెండ్
చేస్తున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీ
సమావేశాలు ఐదురోజుల పాటు నిర్వహించాలని నేడు జరిగిన బీఏసీ లో నిర్ణయించారు.