భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కెనడా పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి సమాచారం
అందే వరకూ వీసాల జారీ నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజంట్ల హస్తం ఉందనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యల అనంతరం వివాదం ముదిరింది. నిర్వహణా కారణాల రీత్యా కెనడా వారికి వీసాల జారీ నిలిపేసినట్టు ఆన్‌లైన్ వీసాలు జారీ చేసే బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. హత్య కేసు విచారణ జరగకుండానే భారత్‌పై నెపాన్ని వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్య కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని భారత్ ప్రకటించింది.