భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా భారత్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చనేందుకు మావద్ద ఆధారాలున్నాయంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.దీనిపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. నిజ్జర్ హత్య విచారణలో భారత్ కెనడాకు సహకరించాలని కోరింది.
వేర్పాటు వాద ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజంట్ల కుట్రదాగి ఉందంటూ వస్తున్న ఆరోపణలను భారత్ ఖండించింది. నిజ్జర్ హత్య విచారణలో కెనడా చేస్తోన్న ప్రయత్నాలకు తాము సహకరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. సమగ్ర, పారదర్శకమైన దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఎలాంటి దర్యాప్తునకైనా భారత్ సహకరిస్తుందని ప్రకటించింది.
కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. నేర విచారణ తరవాతే అసలు నేరస్థులకు శిక్ష పడుతుందని తాము భావిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది. విచారణ పూర్తికాక ముందే ట్రూడో ఆరోపణలు చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమాధికారాలను గుర్తించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది.