తిరుమలలో
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల
నాలుగో రోజు స్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజు నడుస్తుండగా, భక్తుల గోవిందనామ స్మరణ చేశారు. భక్తజనబృందాల భజనలు,
కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ
స్వామి వారి సేవ కోలాహలంగా జరిగింది.
కల్పవృక్ష వాహన సేవను దర్శించిన వారికి
పాల్గొన్న వారికి ఐహిక ఫల ప్రాప్తి లభిస్తుందని నమ్మకం.
క్షీర
సాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో మహిమాన్విత కల్పవృక్షం
కూడా ఒకటి, ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుందని
పురాణాలు చెబుతున్నాయి. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది,
అలాంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన నాలుగోరోజు తిరుమాడ వీధుల్లో భక్తులకు
తనివితీరా మలయప్ప స్వామి దర్శనమిచ్చారు.
రాత్రి
7 గంటల నుంచి 9 గంటలకు వరకు శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. ఈ సేవ
వీక్షణంతో అధికార ప్రాప్తి, అఖండ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
నిన్నరాత్రి శ్రీవారు ముత్యలపల్లకి
వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు.