లోక్‌సభలో దాదాపు ఏకగ్రీవంగా పాస్ అయిన ‘నారీ
శక్తి వందన్ అధినియమ్’ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ రాజ్యసభలో చర్చకు రానుంది.
పెద్దల సభలో బుధవారం నాడు చంద్రయాన్3ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను
అభినందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసారు.
‘‘చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్, అంతరిక్ష
ప్రస్థానంలో భారతదేశపు కీర్తిపతాక’’ అనే అంశంపై రాజ్యసభ బుధవారం నాడు ప్రత్యేక
చర్చ చేపట్టింది. చర్చ పూర్తయాక శాస్త్రవేత్తలను అభినందిస్తూ తీర్మానం చేసింది. ఆ
తీర్మానం ఏకగ్రీవంగా పాస్ అయింది.
చర్చ సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్
జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా
భారత్ నిలవడం దేశానికి గర్వకారణం అన్నారు. ఈ విజయంతో భారతదేశం ప్రతిష్టాత్మక
ఆర్టెమిస్ఒడంబడికలో సభ్యురాలైందని వివరించారు. 2025 నాటికి
చంద్రుడి మీద మానవులను ప్రవేశపెట్టడానికి అమెరికా ప్రారంభించిన ప్రయత్నమే
ఆర్టెమిస్ ఒడంబడిక. ఆరు దశాబ్దాలు దాటిన భారత అంతరిక్ష ప్రస్థానం ఇప్పుడు స్వయంసమృద్ధమైందనీ,
రాకెట్ లాంచింగ్‌కు దేశీయ సామర్థ్యాన్ని సమకూర్చుకుందనీ వివరించారు. ఇప్పుడు
భారతదేశం విదేశాల ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్ళగలుగుతోందని హర్షం
వ్యక్తం చేసారు. ఈనాటివరకూ ఇస్రో 424 విదేశీ ఉపగ్రహాలను లాంచ్ చేసింది.
భారతదేశం కేవలం చంద్రుడి
మీదకు మాత్రమే చేరలేదు. ఇప్పటికే మంగళయాన్ ప్రాజెక్టులో భాగంగా కుజుడి మీద
అధ్యయనాలు చేస్తోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ 2014లో మొదటి ప్రయోగంలోనే కుజుడి
మీదకు విజయవంతంగా చేరుకోగలిగింది. తాజాగా ఆదిత్య ఎల్1 ప్రయోగం కూడా విజయం దిశగా
సాగుతోంది. సమీప భవిష్యత్తులో శుక్రగ్రహం గురించి అధ్యయనం చేయడానికి శుక్రయాన్1
మిషన్ ప్రారంభమవుతుంది. సౌరకుటుంబంలోని గ్రహాలు అన్నింటి మీదా అధ్యయనాలపై ఇస్రో
దృష్టిసారిస్తోందని ఉపరాష్ట్రపతి చెప్పారు.