చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 8 గంటల సుదీర్ఘ చర్చ తరవాత బిల్లుకు దాదాపు ఏకగ్రీవ సమ్మతి లభించింది. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్లో 456 మంది పాల్గొనగా కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. మహిళా బిల్లుకు ఆమోదం లభించడంతో దేశంలోని అన్ని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై
సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 60 మంది సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే, బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ చేపట్టనున్నట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా బిల్లును అమల్లోకి తీసుకొస్తామని షా హామీ ఇచ్చారు. ఈ బిల్లుపై లోక్సభలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతు పలికారు. ప్రస్తుతం సభలో 82 మంది మహిళా సభ్యులుండగా, రిజర్వేషన్ అమలు తరవాత వారి సంఖ్య 181కి పెరగనుంది. ఈ బిల్లును ఎంఐఎంకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన అందరికీ ప్రధాని కృతజ్జతలు తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియమ్ చరిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు మహిళలకు మరింత సాధికారత ఇస్తుందన్నారు. దేశ రాజకీయ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాన ప్రతిపక్ష నేతలు సోనియా, రాహుల్ గాంధీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికారు. అయితే మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా లేకపోవడంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించాల్సిందని ఆయన సలహా ఇచ్చారు. కుల గణన వెంటనే చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 శాఖల కార్యదర్శుల్లో కేవలం ముగ్గురే ఓబీసీలు ఉన్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం కల్పించారు.