స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా రెండో రోజూ నష్టాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంలాంటి అంశాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 796 పాయింట్ల నష్టంతో 66800 వద్ద ముగిసింది. నిఫ్టీ 231 పాయింట్ల నష్టంతో 19878 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్టిపిసీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, మారుతి, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిల్టెల్, టైటన్, ఎల్ అండ్ టీ భారీ నష్టాలను చవిచూశాయి.
ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో అన్ని రంగాల కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 96 డాలర్లకు చేరింది. భారత్ కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కూడా స్టాక్ సూచీలపై ప్రభావం చూపాయి.