ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ ఇవాళ సమావేశమైంది. పరిపాలనా రాజధానిపై సీఎం కీలక ప్రకటన చేశారు. దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగుతుందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని వేయాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ముందస్తు లేదా జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు ముందుగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయానికి, స్థలం లేనివారికి కచ్ఛితంగా ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగి పదవీ విరమణ తరవాత కూడా ఆరోగ్య శ్రీ వర్తించేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. వారి పిల్లల చదువుల ఫీజులు కూడా రీఎంబర్స్ చేయనున్నారు.
క్యాబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు, ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు ఇళ్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదించింది.