చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర మరింత పెరుగుతుందని మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిన ప్రధాని మోదీని ఆమె కొనియాడారు. మూడు దశాబ్దాల మహిళల కల నేడు నెరవేరబోతోందని ఆమె అన్నారు.
ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారణ జరపాలని సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు పురందరేశ్వరి ప్రకటించారు. చవకబారు, నాణ్యతలేని మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది అనారోగ్యం భారిన పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లీటరు రూ.15 ఖర్చుతో చీపులిక్కరు తయారు చేసి రూ.1000పైగా ధరకు విక్రయిస్తూ పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఒక్క మద్యంలోనే ఏపీలో ఏటా 37 వేల కోట్ల అవినీతి జరుగుతోందని, దీనిపై త్వరలో సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. అక్రమ కేసులను తమ పార్టీ సమర్ధించడం లేదని, చంద్రబాబు కేసులను ఉద్దేశించి పురందరేశ్వరి వ్యాఖ్యానించారు.