కెనడాలో స్థిరపడిన సిక్కు వేర్పాటువాది,
భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను తమదేశంలో హత్య చేసింది భారత
ప్రభుత్వం నియమించిన గూఢచారులే అని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కొద్దిరోజుల
క్రితం తమ దేశ పార్లమెంటులో బహిరంగంగా ఆరోపణలు చేయడం… ఇరుదేశాల మధ్యా దౌత్య
సమరానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే అంతకు కొన్ని వారాల క్రితమే భారత్‌కు
వ్యతిరేకంగా నోరువిప్పాలంటూ అమెరికాను కెనడా కోరిందట. కానీ కెనడా అభ్యర్ధనకు
అమెరికా నిర్లిప్తంగా ఉండిపోయిందట. ఆ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తాజాగా
వెల్లడించింది.
భారతదేశంతో సంబంధాల విషయంలో అమెరికాపై
దాని మిత్రదేశాలు ఒత్తిళ్ళు పెంచుతున్నాయని, బైడెన్ ప్రభుత్వం దౌత్యపరమైన సవాళ్ళను
ఎదుర్కొంటోందని, దానికి కెనడా వ్యవహారమే ఉదాహరణ అని వాషింగ్టన్ పోస్ట్
వ్యాఖ్యానించింది.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం… కెనడా
పౌరసత్వం కలిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా… తెర వెనుక చర్చలు
చేపట్టింది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, ఇంగ్లండ్, అమెరికా దేశాలను ఫైవ్ ఐస్
కంట్రీస్ అంటారు. ఆ ఐదు దేశాలూ నిఘా వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. అందుకే
కెనడా మిగతా నాలుగు దేశాలతోనూ చర్చలు జరిపింది. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని
ఒత్తిడి తెచ్చింది. అయితే దానికి అమెరికా సహా ఆ నాలుగు దేశాలూ ఆసక్తి చూపించలేదు.
మరికొన్ని వారాల్లోనే జి-20 దేశాల సదస్సు భారత్‌లో జరగనున్న తరుణంలో భారత్ మీద అంత
పెద్ద ఆరోపణ ప్రత్యక్షంగా చేయడానికి అమెరికా ఆసక్తి చూపలేదు. జి-20 సదస్సులో సైతం
అమెరికా ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు.
కెనడా ప్రధానమంత్రి భారత్ మీద బహిరంగంగా
చేసిన ఆరోపణలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. భారత్‌కు
చెందిన ఒక దౌత్యాధికారిపై కెనడా వేటు వేయడం, మరికొన్ని గంటల్లోనే భారత్, తమ
దేశంలోని కెనడా దౌత్యాధికారిపైనా అలాంటి వేటే వేయడం, రెండు దేశాల మధ్య సంబంధాలనూ
దారుణంగా దెబ్బతీసింది.
నిజ్జర్‌ను భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా
ప్రకటింది. పంజాబ్‌లో జరిగిన పలు దాడుల్లో అతను ప్రధాన నిందితుడు. అతన్ని
భారతదేశానికి అప్పగించాలని భారత్ కెనడాను 2022లోనే కోరింది. నిజానికి భారతదేశం
చాలాకాలం నుంచే ఖలిస్తాన్ ఉద్యమాన్ని అరికట్టాలంటూ సిక్కుల జనాభా ఎక్కువగా ఉన్న
కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా తదితర దేశాలపై ఒత్తిడి చేస్తోంది.
దక్షిణాసియా వ్యవహరాల నిపుణుడు మైకేల్
కుగెల్‌మాన్ పాశ్చాత్య దేశాల సందిగ్ధతను వెల్లడించారు. కెనడాను మిత్రపక్షంగా గుర్తిస్తూనే
కీలక వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను గౌరవించే పాశ్చాత్య దేశాలు… కెనడా
ప్రతిపాదనను అంగీకరించలేదని వివరించారు.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం… భారత్‌లో
జి-20 సదస్సులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భారత ప్రధాని
నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలకు జస్టిన్ ట్రూడో నిరాకరించారు. సదస్సు సమయంలోనే
ఖలిస్తాన్ అంశంపై మాట్లాడడం ద్వారా ఇరుదేశాల సంబంధాలనూ మరింత ఒత్తిడిలోకి
నెట్టారు.
ట్రూడో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ,
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి శునక్‌తోనూ, భారత్‌పై తమ ఆరోపణలను ప్రస్తావించారు. ఆ
అంశాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో చర్చించాలని ఆశించారు… అని కెనడా
విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించిన సంగతిని వాషింగ్టన్ పోస్ట్
ప్రస్తావించింది.
దానికి స్పందనగా, అమెరికా తీవ్ర ఆందోళన
వ్యక్తం చేసింది, నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు ముఖ్యమని సూచించింది, నేరస్తులను
శిక్షించాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా కూడా ఈ అంశాన్ని భారత ఉన్నతాధికారులతో
పలుమార్లు ప్రస్తావించింది.
ఈ సంక్లిష్టమైన పరిస్థితిలో పాశ్చాత్య దేశాలు తమ
మిత్రదేశాలకు, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న భారతదేశంతో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాలకు
మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని పాటించడం తప్పనిసరి అని వాషింగ్టన్ పోస్ట్
వ్యాఖ్యానించింది.