తిరుమల కాలినడక మార్గంలో చిరుతల కలకలం తగ్గడం లేదు. తాజాగా అలిపిరి కాలినడక మార్గంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో గడచిన రెండు మాసాల్లో ఆరు చిరుతలు బోనులో చిక్కాయి. అలిపిరి కాలినడక మార్గంలో లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి పాపను చంపేసిన ప్రదేశంలోనే ఇవాళ మరో చిరుత చిక్కింది. గతంలో దాడి ఘటన జరిగిన 2850వ మెట్టు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. తాజాగా బంధించిన చిరుతను తిరుపతి జూ పార్కుకు తరలించారు.
ఇప్పటికే బంధించిన ఐదు చిరుతల్లో రెండింటిని అటవీ ప్రాంతంలో వదిలేశారు. తిరుమల అడవుల్లో తిరుగుతోన్న చిరుతలు ఒకదాని తరవాత ఒకటి బోనుల్లో చిక్కుకోవడంతో భక్తుల్లో కొంత ఆందోళన తగ్గింది.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో మరో చిరుత కదలికల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుతల సంచారంతో అటు విద్యార్ధులు, స్థానికులు బెంబేలెత్తుతున్నారు. యూనివర్సిటీ సమీపంలోనూ బోనులు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని విద్యార్థులు కోరుతున్నారు.