లోక్‌సభలో ఇవాళ మహిళలకు చట్టసభల్లో
ప్రవేశానికి 33శాతం రిజర్వేషన్లు కేటాయించే బిల్లుపై చర్చ జరగనుంది. ‘నారీ శక్తి
వందన్ అధినియమ్’ బిల్లును దిగువసభలో నిన్న మంగళవారం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి
అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు.
లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యే 11
గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకూ ఈ బిల్లుపైనే చర్చ కొనసాగుతుందని మేఘ్వాల్
ఈ ఉదయం వెల్లడించారు. ఈ బిల్లు రాజకీయ సంబంధమైనది కాదని తేల్చిచెప్పారు.
ఈనాటి సభాకార్యకలాపాలకంటె ముందు ప్రతిపక్ష
భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి సమావేశం కానుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత,
కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఈ కూటమి పార్టీల సమావేశం జరగనుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వైఖరి గురించి ఈ సమావేశంలో
చర్చిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పెర్సన్
సోనియాగాంధీ, ఈ చర్చలో తమ పార్టీ తరఫున పాల్గొంటారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార పక్షం
వైఎస్ఆర్సీపీ ఈ బిల్లుకు పూర్తిగా మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగుదేశం
పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్
కూడా ఈ బిల్లును స్వాగతించింది.