చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిథ్యం కల్పించే నారీ శక్తి వందన్ అధినియమ్ ను లోక్సభలో ప్రవేశ పెట్టారు. దేశ చరిత్రలో సెప్టెంబరు 19 నిలిచిపోతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల పోరాటం తరవాత ఆమోదానికి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను కోరారు.
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే ఎంతో కీలకమైన బిల్లును కేంద్రం తీసుకువస్తోంది. మహిళల నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందడమే మా సంకల్పం. నారీ శక్తి వందన్ అధినయమ్ భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నూతన పార్లమెంటు భవనంలో ప్రవేశ పెట్టిన మొదటి బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ కోరారు. ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందినా 2027 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ప్రధాని తెలిపారు.
కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ఇవాళ ప్రవేశ పెట్టారు. బిల్లు ఆమోదం పొందితే 2027 నుంచి మహిళా ఎంపీల సంఖ్య 181కి పెరగనుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తరవాత సభ రేపటికి వాయిదా పడింది. రేపు దీనిపై చర్చ జరగనుంది.