ఇంటర్నెట్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. వినాయక చవితి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించిన విధంగానే ఇవాళ జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించారు.
అత్యంత వేగంతో జియో ఎయిర్ ఫైబర్ నెట్ సేవలు అందిస్తుంది. 5జీ ఆధారిత వైర్లెస్ వైఫై సేవలు జియో ఎయిర్ ఫైబర్ సొంతం. ఇక నుంచి వైర్ ఆధారిత సేవలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే జియో ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జియో ఎయిర్ ఫైబర్‌లో ఎలాంటి కేబుల్స్‌తో పనిలేదు. సమీపంలోని టవర్స్ నుంచి సిగ్నల్స్ అందుకుని నెట్ సేవలు అందిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ కన్నా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు, వైర్లెస్ ద్వారా అందించనుంది. ఎన్ని మొబైల్స్, కంప్యూటర్లు, ట్యాబులకైనా కనెక్ట్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
కనీస ప్లాన్ రూ.599గా నిర్ణయించారు. ఇందులో 30 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. వీటికి అదనంగా డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి. రూ.599 నుంచి ప్రారంభమయ్యే ప్యాకేజీతోపాటు, గరిష్ఠ ప్యాకేజీ రూ.3999గా నిర్ణయించారు రూ.3999 ప్యాకేజీలో 1 జీబీపీఎస్ స్పీడ్ నెట్ అందిస్తారు. వీటికి అదనంగా ఉచితంగా ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి. నేటి నుంచి అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశమంతా అందుబాటులోకి తీసుకురానున్నారు.