భారత్ కెనడాల మధ్య దౌత్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటు వేసింది. తరవాత కొద్ది గంటలకే భారత్ ధీటుగా సమాధానం చెప్పింది. కెనడా రాయబారిపై వేటు వేసింది. ఐదు రోజుల్లో భారత్‌ను వీడి వెళ్లాలని కెనడా రాయబారిని ఆదేశించింది. కెనడా హైకమిషనర్‌ను భారత అధికారులు పిలిపించారు. కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్టు తెలిపినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. భాతర అంతర్గత వ్యవహారాల్లో కెనడియన్ దౌత్యవేత్త జోక్యం చేసుకోవడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బహిష్కరణ వేటు వేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ నిజ్జర్‌ను హత మార్చడంలో భారత ఏజంట్ల హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంపై భారత్ ధీటుగా సమాధానం చెప్పింది. ఒక ఉగ్రవాదిని వెనుకేసుకురావడంపై భారత్ ఆగ్రహంగా ఉంది.
ఇప్పటికే కెనడాలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్టు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. మా దేశ సార్యభౌమాధికార ఉల్లంఘన ఆమోదయోగ్యం కాదని అందుకే భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్టు జోలీ తెలిపారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే భారత్ చర్యలకు ఉపక్రమించింది. కెనడా దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత చర్యలను ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. భారత తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ సమర్థించారు.