గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి రాజ్‌భవన్ అధికారులతో మాట్లాడారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న గవర్నర్‌కు విజయవంతంగా సర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
సోమవారం నాడు గవర్నర్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో రాజ్‌భవన్ అధికారులు, వైద్యులకు సమాచారం అందించారు. గవర్నర్‌ను పరీక్షించిన వైద్యులు, ఆస్పత్రిలో చేరాలని సూచించారు. తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన అపెండిసైటిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసెక్టమీ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న లోకేశ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ విధులు నిర్వహిస్తారని ఆకాంక్షించారు.
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ తమ ఆస్పత్రిలో చేరారని, వైద్యులు పరీక్షించి అపెండిసైటిస్ గా నిర్ధారించారని డాక్టర్ సుధాకర్ తెలిపారు. రోబో సాయంతో సర్జరీ చేశారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.