భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకుంటున్నాయి. తాజాగా భారత రాయబారిపై కెనడా ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసింది. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉండవచ్చనేందుకు విశ్వసనీయమైన ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ క్రమంలోనే భారత రాయబారిపై వేటు పడింది. అయితే ఆ రాయబారి పేరు మాత్రం వెల్లడి కాలేదు.
గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు అసంబద్దమైనవని భారత్ తోసిపుచ్చింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజంట్లు ఉన్నారని కెనాడా ఆరోపిస్తోంది. కెనడాలో, కెనడియన్ హత్య తమకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. స్వేచ్చా, ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రాథమిక నిబంధనలకు విరుద్ధం అంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ఆరోపించారు. ఇది ప్రాథమిక నిబంధనలకు విరుద్ధమని ప్రకటించారు.
కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలను భారత్ కొట్టివేసింది. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తెస్తోన్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని భారత్ స్ఫష్టం చేసింది. హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు సహా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించే వారిని చేరదీయడం కెనడాకు కొత్తకాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ కెనడా విభాగానికి నాయకత్వం వహిస్తోన్న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను జూన్‌లో సర్రేలోని గురుద్వారాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పి చంపిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌పై అనేక తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.1997లో కెనడా చేరుకున్న హర్దీప్ సింగ్ ఖలిస్తానీ టైగర్స్ ఫోర్స్ గ్రూపులో మాస్టర్ మైండ్‌గా పనిచేస్తున్నాడు. ఇతన్ని తమకు అప్పగించాలని భారత్ రెండు దశాబ్దాలుగా కోరుతోంది. పంజాబ్‌లోని జలంధర్‌లో హిందూ పూజారి హత్యలో కూడా నిజ్జర్ హస్తముందని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. 2007లో ఓ సినిమాను వ్యతిరేకిస్తూ జరిగిన దాడిలో కూడా నిజ్జర్ నిందితుడు. కెనడా, యూకే, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలపై జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయం ఉండవచ్చనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.