తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం చిన్నశేష
వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.
వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
గోవింద
నామస్మరణతో తిరుమాఢ వీధులు మార్మోగుతున్నాయి. మంగళ వాయిద్యాలు, కోలాటల నడుమ కోలాహలంగా
స్వామివారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రికి హంస వాహనంపై
దర్శనమిస్తారు. తొలిరోజు రాత్రి పెద్దశేష
వాహనంపై స్వామివారు విహరించారు.
తిరుమల
వేంకటేశుడిని సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద స్వాగతం పలికిన ప్రధాన
అర్చకులు..దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేశారు. సీఎం జగన్ వెంట, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ,
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్
రెడ్డి ఉన్నారు.
బ్రహ్మోత్సవాల తొలిరోజైన
సోమవారం రాత్రి సీఎం జగన్ , రాష్ట్రప్రభుత్వం తరఫున వేంకటేశ్వరస్వామికి పట్టు
వస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున
తరలివచ్చారు.
ఈ ఉదయం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, ఆపదమొక్కులవాడి దర్శనానికి 8 గంటల సమయం
పడుతోంది. నిన్న శ్రీవేంకటేశ్వరస్వామిని 62,745 మంది దర్శించి మొక్కులు
చెల్లించుకున్నారు. స్వామి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి
దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 24, 451 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.