వామపక్ష భావజాల సమర్థకులు ఇప్పుడు
సాంస్కృతిక మార్క్సిజం పేరుతో ప్రపంచమంతటినీ నాశనం చేస్తున్నారని రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. ఆ ఉపద్రవం నుంచి
ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత భారతదేశంపైనే ఉందని ఆయన చెప్పారు.
మహారాష్ట్రలోని పుణేలో అభిజీత్ జోగ్
రాసిన మరాఠీ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి మోహన్ భాగవత్ ప్రధాన అతిథిగా
హాజరయ్యారు. ఆ సందర్బంగా మాట్లాడుతూ ఆయన కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు. ప్రపంచానికి
మేలు జరిగే ప్రతీ సందర్భంలోనూ వామపక్షీయులు అడ్డుపడుతున్నారని చెప్పారు.
ప్రత్యేకించి, సాంస్కృతిక మార్క్సిజం పేరిట ప్రపంచమంతా, ప్రత్యేకించి పశ్చిమ
దేశాల్లో, వినాశనం మొదలుపెట్టారని భాగవత్ అన్నారు. ‘‘విమర్శ పేరిట సమాజంలో తప్పుడు
ఆలోచనల విషబీజాలు నాటేందుకు వామపక్షాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల
సమాజానికి నష్టం వాటిల్లుతోంది. మానవత్వం ఉండాల్సిన చోట పశుత్వం ప్రబలిపోతోంది.
వామపక్షవాదులు వ్యాపింపజేస్తున్న ఈ ముప్పు ఇప్పుడు భారతదేశానికి కూడా వస్తోంది. మన
సమాజంలోకి మాత్రమే కాదు, ప్రతీ ఇంటికీ ఈ ముప్పు చేరువయిపోయింది. అందుకే భారతీయ
సమాజం మరింత ఎక్కువ చైతన్యంగా ఉండాలి’’ అని మోహన్ భాగవత్ చెప్పారు.
‘‘ఇవాళ మనకు కనిపిస్తున్న ఈ ముప్పు
నిజానికి కొత్తదేమీ కాదు, పాతదే. దేవతలు రాక్షసుల మధ్య యుద్ధానికి ఇది ఆధునిక రూపం
మాత్రమే. లెఫ్టిస్టుల ఇలాంటి దాడుల నుంచి రక్షించుకునే సమర్థత భారతీయ సంస్కృతి,
సనాతన విలువలలో మాత్రమే ఉంది. వామపక్షవాదుల విమర్శలను నిరాకరించడానికి మొదటగా
సత్యం, కరుణ, శుచి, తపస్సు అనే నాలుగు విలువలను ఈ సమాజం నేర్చుకోవలసి ఉంది. మన
సనాతన సంస్కృతికి చెందిన విషయాలను కొత్త తరాలకు పరిచయం చేయాలి. ఇలాంటి సమస్యలను
భారతదేశం ఎప్పటినుంచో ఎదుర్కొంటోంది. ఇప్పుడీ సమస్య నుంచి రక్షించుకోగల సామర్థ్యం
భారతదేశానికి మాత్రమే ఉంది. సనాతన విలువల మార్గాన్ని అనుసరించడం ద్వారానే సమాజం
ఇలాంటి పని చేయగలదు. అందుకే ఇలాంటి పుస్తకాలుఅన్ని భాషల్లోనూ
వెలువడాల్సిన అవసరం ఉంది. మన విలువలు, మన ఆలోచనాధోరణిని ఇతర మార్గాల్లో కూడా
ఇంటింటికీ వ్యాపింపజేయాలి. ఆ పని ఏదో ఒక సంస్థ మాత్రమే చేసేది కాదు, మొత్తం
సమాజానికి ఆ బాధ్యత ఉంది. తద్వారా మనం కేవలం మన దేశాన్ని మాత్రమే కాదు, మొత్తం
ప్రపంచాన్నీ ఈ కల్చరల్ మార్క్సిజం అనే పెడధోరణి నుంచి విముక్తం చేయగలుగుతాం’’ అని
మోహన్ భాగవత్ చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కులపతి
డాక్టర్ శాంతిశ్రీ పండిత్ మాట్లాడుతూ వామపక్షవాదులు తమ భావజాలాన్ని ప్రచారం చేసుకోడానికి
బలమైన ఎకోసిస్టమ్ రూపొందించుకున్నారని చెప్పారు. వారికి దీటుగా ఎదుర్కోడానికి,
వారి ప్రచారానికి సమర్థంగా స్పందించడానికి మనం కూడా అటువంటి బలమైన ఎకోసిస్టమ్
తయారు చేసుకోవాలన్నారు. మన భావజాలాన్ని, మన విలువలను ప్రపంచం ముందు పెట్టడానికి
మనం భయపడవలసిన అవసరం లేదన్నారు.
పుస్తక రచయిత అభిజీత్ జోగ్ మాట్లాడుతూ వామపక్షవాదుల
భావజాలానికి కేంద్రం ఈర్ష్య, ద్వేషం, అరాచకత్వం అని స్పష్టం చేసారు. వాటితోనే వారు
మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారని, ఆ విషయాన్నే తన పుస్తకంలో నిరూపించాననీ
చెప్పారు.
పుస్తక ప్రచురణకర్త
దిలీప్‌రాజ్ ప్రకాశన్ మేనేజర్ రాజీవ్ బర్వే సభను ప్రారంభించారు. సింబయాసిస్ కళాశాల
యాజమాన్యానికి చెందిన డాక్టర్ మజుందార్, డాక్టర్ విద్యా యెరవడేకర్లు మోహన్ భాగవత్‌ను
సన్మానించారు. మిలింద్ కులకర్ణి కార్యక్రమాన్ని నడిపించారు. కళాశాలకు చెందిన
మధుమితా బర్వే వందన సమర్పణ చేసారు.