గత నెల వరకు వినియోగదారులకు చుక్కలు చూపించిన టొమాటో ధరలు, నేడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జూన్, జులై, ఆగష్టు మాసాల్లో కిలో టొమాటో గరిష్ఠంగా రూ.250 దాటిపోయింది. మద్యతరగతి వారు సైతం టొమాటో కొనుగోలు చేయడానికి వెనకడుగు వేశారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టొమాటో ధరలు దారుణంగా పతనమయ్యాయి. కిలో టొమాటో 50పైసలకు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. క్వింటా టొమాటోలు కోత, రవాణాకు రూ.300 ఖర్చులు అవుతున్నాయని, తీరా మార్కెట్కు తీసుకు వస్తే రూ.50 మాత్రమే ధర దక్కుతోందని రైతులు వాపోతున్నారు.
వర్షాకాలం ప్రారంభంలో టొమాటో ధరలు పెరగడంతో రైతులు పెద్ద ఎత్తున సాగు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా పంట కోతకు రావడంతో ధరలు పతనం అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం రంగంలోకి దిగి కిలోకు కనీసం రూ.15 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.