స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అధికారుల తీరు అనుమానాలకు తావిచ్చేదిగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. స్కిల్ కేసు విచారిస్తోన్న సీఐడి అధికారులు కనీసం ఏపీలో ఒక్క శిక్షాణా కేంద్రాన్ని అయినా పరిశీలించారా అని ఆమె ప్రశ్నించారు. విద్యార్ధుల్లో నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణా కేంద్రాల్లో అవసరమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేసినట్టు తమ పరిశీలనలో తేలిందని పురందరేశ్వరి తెలిపారు.
అధికారంలో వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని పురందరేశ్వరి విమర్శించారు. లీటరు మద్యం రూ.15కు తయారు చేసి వేల రూపాయలకు విక్రయిస్తున్నారని, ఇందులో సీఎంకు వేల కోట్లు ముడుపులు అందుతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రమాదకరమైన రసాయనాలు కలిపి మద్యం తయారు చేసి, ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏటా మద్యంపై రూ.15 వేల కోట్ల ఆదాయం ఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏటా రూ.32 వేల కోట్లకు పెంచారని పురందరేశ్వరి ధ్వజమెత్తారు. మద్యం వ్యాపారంలో సీఎం జగన్మోహన్రెడ్డికి వేల కోట్లు ముడుతున్నాయని ఆమె విమర్శించారు.