వైసీపీ
ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు
చేసిందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా సభకు
హాజరైన ఆ పార్టీ ఎంపీలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబుపై నమోదైన అక్రమ
కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ
ఎంపీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, మాజీ
ఎంపీలు పాల్గొన్నారు.
మచ్చలేని నాయకుడు
చంద్రబాబుపై రాజకీయ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నట్లు ఎంపీ కేశినేని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు తెలియజేసేందుకే నిరసన వ్యక్తం చేస్తున్నట్లు మరో ఎంపీ గల్లా
జయదేవ్ చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి చంద్రబాబుపై తప్పుడు కేసులు
పెట్టారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
చంద్రబాబు
అరెస్టును తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో రిలే
నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజల్లో
పాల్గొన్న తెలుగుదేశం శ్రేణులు.. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని గణపతిని
ప్రార్థించారు.
రాజమహేంద్రవరం
జైలులో ఉన్న చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ పొలిట్‌బ్యూరో
సభ్యుడు యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు. 45 నిమిషాలు పాటు చంద్రబాబుతో
మాట్లాడారు.
జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత
కల్పిస్తున్నట్లు జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. వారానికి రెండు ములాకత్‌లు
ఉంటాయని, అత్యవసరమైతే మరో ములాకత్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాల
మేరకు చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.