పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్దమైంది. మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ లోక్సభలో ప్రసంగించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. 75 ఏళ్ల ప్రస్థానంపై చర్చతోపాటు నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం జరగనున్న సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండవని కేంద్రం ప్రకటించింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రధాని ప్రసంగిస్తారు. 75 ఏళ్ల పార్లమెంటు
ప్రస్థానంలో సాధించిన విజయాలు, అనుభవాలపై ప్రధాని ప్రసంగం సాగనుంది. ప్రధాని తరవాత కీలక మంత్రులు ప్రసంగించనున్నారు. ఇవాళ పాత భవనంలో ప్రారంభమయ్యే సమావేశాలు రేపు కొత్త పార్లమెంట్ భవనంలోకి మారనున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్, వారి హోదాపై బిల్లుపై చర్చ రానుంది. ఈసీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో కొనసాగుతున్నారు. దీన్ని క్యాబినెట్ స్థాయికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఇక 33 శాతం మహిళా బిల్లు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.